ధృతరాష్ట్ర మహారాజు పుట్టుకతోనే గుడ్డి వాడే కాక ఆధ్యాత్మిక జ్ఞానం కూడా లోపించిన వాడు. తన పుత్ర వ్యామోహమే అతడిని ధర్మపథం నుండి తప్పించి, న్యాయపరంగా పాండవులకు చెందిన రాజ్యాన్ని లాక్కునేటట్లు చేసింది. ఆయనకు తన తమ్ముని కుమారులే అయిన పాండు పుత్రులకు తను చేసిన అన్యాయం తెలుసు. తన అంతఃకరణలో తప్పు చేసిన భావన, అతడు యుద్ధం యొక్క ఫలితాన్ని గురించి ఆందోళన చెందేట్టు చేసింది, అందుకే కురుక్షేత్ర యుద్ధభూమిలో ఏమి జరుగుతోందని సంజయుడిని అడిగాడు.